సూపర్' మోసం: బాబుపై జగన్ నిప్పులు

సూపర్ సిక్స్, సెవెన్ హామీలపై మాజీ సీఎం ఫైర్
అమరావతి: టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 'సూపర్ సిక్స్', 'సూపర్ సెవెన్' హామీలను సక్రమంగా అమలు చేయలేదంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాలని డిమాండ్ చేశారు. "సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కింద ఏం చేశారో చెప్పాలి. సక్రమంగా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఎలా ప్రచారం చేసుకుంటున్నారు?" అని జగన్ ప్రశ్నించారు.
 * ఉచిత బస్సు ప్రయాణంపై మోసం: ఎన్నికలకు ముందు "ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఏ బస్ అయినా ఎక్కొచ్చని" చెప్పి, ఇప్పుడు షరతులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు.
 * ఇతర హామీలు ఏవి?: ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ వంటి హామీలను ఎక్కడ అమలు చేశారని నిలదీశారు.
 * రైతులపై నిర్లక్ష్యం: చంద్రబాబు 10 నెలల పాలనలో 17 ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఏ ఒక్క రైతుకు ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
 * ఉచిత పంటల బీమా రద్దు: తమ ప్రభుత్వ హయాంలో రైతులకు హక్కుగా దక్కిన ఉచిత పంటల బీమాను రద్దు చేశారని, రూ. 7,400 కోట్ల బీమా పరిహారం రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"రైతు, రైతు కూలీ సంతోషంగా లేకుంటే రాష్ట్రం వెనకడుగు వేయాల్సి వస్తుంది," అని జగన్ పేర్కొన్నారు. తన హయాంలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని చంద్రబాబు నరకానికి మార్చారని ఆయన విమర్శించారు. చంద్రబాబు, ఆయన కొడుకు, దత్తపుత్రుడు 420 చేష్టలు చేస్తున్నారని, వీరిపై చీటింగ్ కేసు పెట్టాల్సిందేనని జగన్ పునరుద్ఘాటించారు.

Post a Comment

0 Comments