రైతులకు శుభవార్త కృషి విజ్ఞాన కేంద్రానికి 50 ఎకరాలు కేటాయింపు

పాలకొండ వెబ్ న్యూస్  :ఖండాంతర ఖ్యాతిగాంచిన విజయనగరం గడ్డపై అన్నదాతల కష్టాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. సాగు సాగులో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు అవసరమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు ముంగిటకే తీసుకెళ్లే దిశగా కీలక అడుగు పడింది. జిల్లాల పునర్విభజన కారణంగా పాలకొండ నియోజకవర్గంలోని పలు మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం కావడంతో, స్థానిక రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం (KVK) అంశం నిలిచిపోయింది.

ఆమదాలవలసలోని కృషి విజ్ఞాన కేంద్రం దూరంగా ఉండటంతో పాటు విజయనగరం జిల్లాలో సరైన వసతులు లేక సాగు విజ్ఞానం అందక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని గుర్తించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు రైతులకు శాశ్వత పరిష్కారం చూపుతూ ముందుకు వచ్చారు.

విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానంలో శనివారం నిర్వహించిన శాస్త్రవేత్తలు–రైతుల ముఖాముఖి సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే, కృషి విజ్ఞాన కేంద్ర భవన నిర్మాణానికి మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో ఉన్న సుమారు 50 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఎన్నేళ్లుగా భూ సమస్య పరిష్కారం కోసం తిరిగినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందిన రైతులకు ఈ ప్రకటన ఊరటనిచ్చింది. అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావుతో పాటు ఉత్తరాంధ్ర రైతాంగం ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షాతిరేకాలతో స్వాగతించింది.

ఈ నిర్ణయంపై ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ టి.ఎస్.ఎస్.కె. పాత్రో మాట్లాడుతూ, భూమి అందుబాటులోకి రావడంతో ఏఎన్జీ ఆర్‌ఏయూ అధికారులతో సంప్రదించి త్వరలోనే కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కేంద్రం ఆధునిక సాగు పద్ధతులను రైతులకు చేరవేసే కీలక కేంద్రంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Post a Comment

0 Comments