రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 1207 ద్వారా ఉద్యోగాల నుండి తొలగించబడిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను సుప్రీంకోర్టు తీర్పు మేరకు తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె. జగన్మోహన్ రావు మరియు తాళ్ళూరి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురువారం ఒక లేఖ ద్వారా తమ విన్నపాన్ని తెలియజేశారు.
గత 2024 డిసెంబర్ 5వ తేదీన ప్రభుత్వం సుమారు 920 మంది కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లను విధుల్లో నుండి తొలగించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. దీనిపై బాధితులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, 2013 నాటికి పని చేస్తున్న వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని 2025 అక్టోబర్ 19న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని వారు వివరించారు. కోర్టు ఆదేశాలు ఇచ్చి దాదాపు 70 రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం నుండి ఇంతవరకు ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గత 13 నెలలుగా జీతాలు లేక, ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారి కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను మానవతా దృక్పథంతో ఆలోచించి, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ హెల్త్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరితగతిన జారీ చేయాలని యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
0 Comments