పాలకొండ వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న చేపట్టిన సార్వత్రిక సమ్మె పాలకొండలో విజయవంతమైంది. సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కోట దుర్గమ్మ ఆలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో భారీ మానవహారం ఏర్పాటు చేసి, తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీవోస్ ప్రతినిధి బృందం తమ పూర్తి సంఘీభావం తెలియజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్. హిమప్రభ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె. గౌరీశ్వరి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కాద రాము, అర్తమూడి లక్ష్మణరావు, రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి వై. శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యుఎఫ్ పాలకొండ డిపో నాయకులు బివి రావు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను కట్టుబానిసలుగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. కార్పొరేట్ అనుకూల విధానాలను మానుకోవాలని, దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది ఈ రోజు సమ్మెలో పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించారని తెలిపారు. తక్షణమే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేనిపక్షంలో ప్రజల మద్దతుతో ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.
ప్రధానంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ల రద్దుతో పాటు, కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని నాయకులు డిమాండ్ చేశారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలపై చట్టం చేయాలని, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. పాత ఉపాధి హామీ పద్ధతిలోనే 200 రోజుల పని దినాలు కల్పించి, రోజువారీ వేతనం 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, వారికి కనీస వేతనాలు అమలు చేస్తూ రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఆటో, ట్రాన్స్‌పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, పెరిగిన భారీ పెనాల్టీల వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.
ఈ సమ్మెలో ఆటో, టాక్సీ, రైస్ మిల్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీఆర్ఏలు, మున్సిపల్ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, వెలుగు వివోఏలు, స్కూల్ ఆయాలు, శానిటేషన్ కార్మికులు, నైట్ వాచ్‌మెన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు దూసి దుర్గారావు, ఏ భానుచందర్, మజ్జి వీరం నాయుడు, బబ్బాది శివ, జి జెస్సీ బాయ్, జి శారద, కె శారద, చిట్టమ్మ, లక్ష్మి, సిహెచ్ సంజీవి, పి వేణు, వై హరిబాబు, పి రాము, జి మన్మధరావు, జి సత్యం, బి రామయ్య, ఏఎస్ నాయుడు పాల్గొన్నారు. అలాగే ఏపీ ఎన్జీవోస్ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర రావు, లిల్లీ పుష్పనాదం, ఈశ్వరరావు తదితర ప్రతినిధులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు
0 Comments