అన్నదాతల అప్పుల భారంపై అభ్యుదయ రైతు కండాపు ప్రసాద్ రావు ఆవేదన

పాలకొండ వెబ్ న్యూస్: దేశంలో అతిపెద్ద ఉపాధి కల్పనా రంగమైన వ్యవసాయం పట్ల పాలకులు చూపుతున్న అలసత్వం వల్ల రైతులు అస్తిత్వాన్ని కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అభ్యుదయ రైతు కండాపు ప్రసాద్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ జిడిపిలో 16-18 శాతం వాటా కలిగి ఉన్న వ్యవసాయ రంగానికి 'జై కిసాన్' అన్నది కేవలం నినాదంగానే మిగిలిపోయిందని విమర్శించారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఏపీలో ఒక్కో రైతు కుటుంబంపై సగటున 2,35,554 రూపాయల అప్పు ఉందని, తెలంగాణ 1,52,113 రూపాయలతో ఐదో స్థానంలో ఉందని గుర్తుచేశారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్లు రుణమాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎందుకు అన్యాయం చేస్తోందని ప్రశ్నించారు. మేరా భారత్ మహాన్, వికసిత్ భారత్ వంటి నినాదాలు సరిపోవని, రానున్న కాలంలో ఆహార భద్రతను కాపాడుకోవాలంటే తక్షణమే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments