పాలకొండ వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ మరియు జి.పి.ఎస్. పాఠశాలల్లో సుమారు 12 సంవత్సరాల నుండి పనిచేస్తున్న 1264 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల (CRT) సమస్యపై ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు శాసనమండలిలో గళమెత్తారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన డి.ఎస్.సి. నోటిఫికేషన్‌లో వీరు పనిచేస్తున్న పోస్టులను కూడా చూపడం వల్ల, సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న ఈ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, 1264 మంది ఆశ్రమ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరికీ తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. డి.ఎస్.సి. నోటిఫికేషన్ నుండి ఈ పోస్టులను మినహాయించకపోతే, దశాబ్ద కాలంగా గిరిజన ప్రాంతాల్లో విద్యనందిస్తున్న వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆయన హెచ్చరించారు. ఈ సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఆయన సభలో స్పష్టం చేశారు.
0 Comments