పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 10 ఏప్రిల్, 2026:పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఆస్తి మరియు ఖాళీ స్థల పన్ను బకాయిలను ఈ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లించే వారికి వడ్డీలో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ మేరకు రాయితీ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మెమో నం.3161714/C2/2026 జారీ చేసినట్లు నగర పంచాయతీ కమిషనర్ రతన్ రాజ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గత మార్చి నెలలో అమలు చేసిన ఈ వడ్డీ రాయితీ పథకాన్ని ప్రస్తుత ఏప్రిల్ నెలలో కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. పట్టణ పరిధిలోని పన్ను బకాయిదారులు ప్రభుత్వం కల్పించిన ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు.
మరోవైపు ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందుగానే చెల్లించే వారికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఎవరైతే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీ లోపు ఏక మొత్తంగా చెల్లిస్తారో, వారికి పన్ను మొత్తంలో 5 శాతం రాయితీ లభిస్తుందని కమిషనర్ రతన్ రాజ్ స్పష్టం చేశారు. పాత బకాయిలపై వడ్డీ రాయితీతో పాటు, కొత్త ఆర్థిక సంవత్సరం పన్నుపై లభించే ఈ 5 శాతం రిబేటును పన్ను చెల్లింపుదారులు ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లభించే ఈ రాయితీలు పొందడం ద్వారా పౌరులు తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
news by: BSS Prasad
0 Comments