నరసింహ చెరువు పునరుద్ధరణకు పచ్చజెండా: హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 21 ఏప్రిల్, 2026..​పాలకొండ మండలం వెలగవాడ మరియు పిఆర్ రాజుపేట గ్రామాల మధ్య గల చారిత్రక నరసింహ చెరువు పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం ముందడుగు వేయడం పట్ల స్థానిక రైతుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు గత ఏడాది కాలంగా పూడికతో నిండిపోయి నీటి నిల్వ సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయింది. దీనివల్ల చెరువుకు సంబంధించిన ఐదు మదుములకు నీరు అందకపోవడమే కాకుండా, దీనిపై ఆధారపడిన మరో ఐదు గొలుసుకట్టు చెరువులకు సైతం సాగు మరియు తాగునీరు నిలిచిపోయింది. ఫలితంగా నాలుగు గ్రామాలకు చెందిన సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందక బీడు భూములుగా మారే పరిస్థితి ఏర్పడింది.

​ఈ గడ్డు పరిస్థితులపై రైతు సంఘం కార్యదర్శి బంటు దాసు మరియు అభ్యుదయ రైతు, వాటర్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ నిపుణుడు ఖండాపు ప్రసాదరావు జిల్లా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డికి క్షేత్రస్థాయి సమస్యలను విన్నవించారు. రైతుల విన్నపంపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. నరసింహ చెరువు పునరుద్ధరణ పనులకు జిల్లా యంత్రాంగం అనుమతులు మంజూరు చేసినట్లు డిపిఆర్ఓ వెల్లడించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

​గత ఐదేళ్లుగా తాము చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించిందని బంటు దాసు మరియు ప్రసాదరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతు ఆర్థికంగా బలోపేతమై వ్యాపారవేత్తగా ఎదగాలన్న లక్ష్యంతో తాము సమర్పించిన నివేదికను కలెక్టర్ ఆమోదించడం శుభపరిణామమని వారు కొనియాడారు. చెరువు పునరుద్ధరణ పనులు జరుగుతున్న సమయంలో రైతులు, క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సూచనలు మరియు సలహాలు అందించి పనులు నాణ్యంగా జరిగేలా చూడాలని వారు కోరారు

Post a Comment

0 Comments