ఉచిత పథకాలు ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 28 ఏప్రిల్, 2026:ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం వేస్తున్నాయని జోనల్ వ్యవసాయ విస్తరణ, పరిశోధన సలహా మండలి సభ్యుడు ఖండాపు ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉచిత పథకాలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు స్పందించిందని ఆయన తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జాయ్ మాల్లా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించి, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మరియు కాగ్ కు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

​రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చే హామీల వల్ల ప్రభుత్వానికి అయ్యే ఖర్చు, ఆ నిధుల సేకరణ మార్గాలను స్పష్టం చేస్తూ ఆర్థిక ప్రభావ ప్రకటన సమర్పించాలని ప్రసాదరావు కోరారు. నిబంధనలు ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు చేయాలని విన్నవించారు. ఒక ప్రభుత్వం చేసే అప్పులను తీర్చడానికి మరో ప్రభుత్వం మళ్లీ అప్పులు చేయడం వల్ల భవిష్యత్ తరాలపై పెను భారం పడుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణను కాపాడడమే లక్ష్యంగా ఈ పిటిషన్ దాఖలైందని, దీనివల్ల ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments