పాలకొండలో వైస్సార్సీపీ భారీ ర్యాలీ: పెట్రో ధరల పెంపుపై నిరసన జ్వాలలు

పాలకొండ వెబ్ న్యూస్, 18 మే 2026:

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైస్సార్సీపీ అధినేత వై.యస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పాలకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, మాజీ శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో ఆర్.టీ.సీ కాంప్లెక్స్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ కార్యక్రమం సాగింది. అనంతరం ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పెట్రో ధరల మంట మొదలైందని, దీనివల్ల రాష్ట్ర ప్రజలపై ఏడాదికి 3,391 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పుడు ఆ విషయాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. గత వైస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేయడమే కాకుండా, ఈ బాదుడుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు పన్నులు తగ్గిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పుడు మాట తప్పారని, సైకిళ్లు వాడాలంటూ ఉచిత సలహాలు ఇస్తూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, ఇచ్చిన మాట ప్రకారం వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ పరిధిలోని వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల కమిటీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

1 Comments