పుస్తక పఠనం, నిరంతర శ్రమ ఉంటే జీవితంలో ఎంతటి ఉన్నత స్థానానికైనా చేరుకోవచ్చని సంస్కృత అధ్యాపకులు కొంగరపు గడ్డియ్య నిరూపించారు. పాలకొండ శాఖా గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తన విజయ ప్రస్థానాన్ని పంచుకున్నారు. పాలకొండ మండలం సచివాలయ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన గడ్డియ్య, ఆ తర్వాత పెదకాపు వీధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ఎంపికయ్యారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీకాకుళం బాలుర డిగ్రీ కాలేజీలో సంస్కృత అధ్యాపకులుగా ఎంపికై ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
హాస్టల్ లో చదివినప్పటి నుంచి అలవాటైన కష్టపడే తత్వం, గ్రంథాలయంలోని పుస్తకాలే తన ఎదుగుదలకు ముఖ్య కారణాలని గడ్డియ్య పేర్కొన్నారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ, కుటుంబ సభ్యులు, అన్నదమ్ముల ప్రోత్సాహం, సతీమణి నాగమణి అందించిన సహకారం వల్లే ఈ ఉన్నత స్థాయికి చేరుకున్నానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు కె.జనార్ధన రావు, నూకాల నగేష్ కుమార్ మాస్టర్, బొత్స రమణ మరియు స్థానిక గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు పాల్గొని, గడ్డియ్యను ఘనంగా సన్మానించారు. ఆయన జీవన ప్రయాణం విద్యార్థుల్లో గొప్ప ప్రేరణ నింపింది.
news by: BSS Prasad
0 Comments