పాలకొండ వెబ్ న్యూస్, 25 మే 2026:పాలకొండ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఒక మంచి కార్యక్రమం ప్రారంభమైంది. స్థానిక కోటదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో ధర్మశాస్త్ర పీఠం పాలకొండ వారి ఆధ్వర్యంలో ఈరోజు నుండి ప్రతిరోజు చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు అటుగా వెళ్లే ప్రజలు కూడా ఈ వేసవి వేడిని తట్టుకునేలా మజ్జిగను అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం నిరంతరాయంగా సాగడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని నిర్వాహకులు కోరారు. ఇక ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి దాతలుగా తుమ్మగుంట శంకర్ రావు మరియు అనూష దంపతులు వ్యవహరించి తమ ఉదారతను చాటుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ చల్లని మజ్జిగ కేంద్రాన్ని స్థానికులు ఎంతగానో అభినందిస్తున్నారు.
news by: BSS Prasad
0 Comments