పాలకొండ, మే 31 ( పాలకొండ వెబ్ న్యూస్):
పాలకొండ పట్టణానికి చెందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ విశ్రాంత కార్యనిర్వహణ అధికారి (ఈఓ) బలివాడ సూర్యరావు (బాబ్జి) ఆదివారం (31-5-2026) అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మరణవార్త విన్న పాలకొండ పట్టణ ప్రజలు, దేవాదాయ శాఖ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
దేవాలయాల అభివృద్ధికి విశేష సేవలు
బలివాడ సూర్యరావు దేవాదాయ శాఖలో సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో, నిబద్ధతతో విధులు నిర్వహించారు. గతంలో ఆయన పాలకొండ పట్టణ ప్రజల ఆరాధ్యదైవమైన శ్రీ కోట దుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణ అధికారిగా సేవలందించి, ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా, పరిసర ప్రాంతాల్లోని పలు ప్రముఖ దేవాలయాల్లో కూడా ఈఓగా బాధ్యతలు చేపట్టి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు.
మృదుస్వభావి, నిగర్వి అయిన సూర్యరావు గారి మరణం పాలకొండ ప్రాంతానికి తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.ఆయన మృతి పట్ల దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, ఆలయ ఈ.ఓ. అర్చకులు, స్థానిక నాయకులు, పాలకొండ శిష్టకరణం సంక్షేమ సంఘం మరియు భక్తులు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు.
0 Comments