పాలకొండ వెబ్ న్యూస్, మే 22: పాలకొండ నగర పంచాయతీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ అధికారుల అవగాహనా రాహిత్యంతో అస్తవ్యస్తంగా జరిగిందని టీడీపీ నగర అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నగర పంచాయతీ కమిషనర్‌కు అభ్యంతర పిటిషన్ అందజేశారు. వివిధ రాజకీయ పార్టీల సూచనలు, సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా వార్డుల పునర్విభజన ముసాయిదా రూపొందించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఏ వార్డు పరిధిలో ఏయే వీధులు ఉన్నాయో స్పష్టంగా పేర్కొనలేదన్నారు. అలాగే ఓటర్ల సంఖ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాల వివరాలు లేకుండా అయోమయం సృష్టించారని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించి ముసాయిదాను రద్దు చేసి, అన్ని పార్టీల ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు తీసుకొని పారదర్శకంగా తిరిగి పునర్విభజన చేపట్టాలని కోరారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్, పాలకొండ సబ్ కలెక్టర్‌కు కూడా అభ్యంతర పిటిషన్ అందజేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్ దుర్గారావు, దుమ్ముదు దుర్గారావు పాల్గొన్నారు.news by: BSS Prasad
0 Comments