రైతు కష్టాన్ని గుర్తించని ప్రభుత్వాలవి ఖాళీ నినాదాలే: ఖండాపు ప్రసాదరావు

​పాలకొండ వెబ్ న్యూస్, 18 మే 2026:

​ప్రభుత్వాలు ఎంతటి అభివృద్ధి కథలు చెప్పినా రైతు కష్టం గుర్తించనంత కాలం అవి ఖాళీ నినాదాలుగానే మిగిలిపోతాయని అభ్యుదయ రైతు, సీనియర్ సిటిజన్ ఖండాపు ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పతనమవుతున్నాయని, ఒక రైతు మార్కెట్‌కు తెచ్చిన 1262 కిలోల ఉల్లి విక్రయానికి రూ.1263 ఖర్చయిందని పేర్కొన్నారు. దీనివల్ల రైతు కష్టానికి ప్రతిఫలం దక్కకపోగా జేబు నుంచి అదనంగా రూపాయి నష్టపోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. బడ్జెట్‌లో ధరల స్థిరీకరణకు కోట్లు కేటాయించామని పాలకులు డబ్బా కొట్టుకుంటున్నా, రవాణా ఖర్చులు కూడా రాక రైతులు టమాటాలను కాలువల్లో పారబోస్తున్న పరిస్థితి పాలకులకు కనపడటం లేదా అని ప్రశ్నించారు., రైతు చెమట చుక్కే దేశానికి అసలైన సంపదన్నారు. రైతు నవ్వితేనే రాష్ట్రం బతుకుతుందని, అన్నం పెట్టే హస్తాలు న్యాయం కోసం ఆకాశం వైపు చూసేలా చేయడం సమాజానికే అవమానకరమని అన్నారు. సొంత పార్టీల కోసం కోట్లు ఖర్చు పెడుతూ, అధికార దుర్వినియోగానికి పాల్పడే పాలకులు రైతుల పంటలకు మద్దతు ధర ఎందుకు కల్పించడం లేదని ఆయన నిలదీశారు.

Post a Comment

0 Comments