పాలకొండ వెబ్ న్యూస్, 19 జూన్ 2026:పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం అంపిలి గ్రామంలో నాగావళి నదీ తీరమున నూతనముగా నిర్మాణమైన ఆలయంలో శ్రీశ్రీశ్రీ అమర నాగ లింగేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు జూన్ 22 సోమవారం నుండి జూన్ 25 గురువారం వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ద్వాపర యుగాంతములో బలరామునిచే కపోత మల్లేశ్వర స్వామి, గుప్తేశ్వరస్వామి, సంఘమేశ్వర స్వామి, ఉమారుద్రకోటేశ్వర స్వామి, మణి నాగేశ్వర స్వామిగా పంచలింగాల క్షేత్రములుగా ప్రతిష్ఠించబడి పూజలందుకొనుచూ, ప్రస్తుత కలియుగంలో అంపిలి గ్రామంలో గ్రామస్థులచే ఈ ఆలయం నిర్మితమైంది.ఈ త్రిరాత్రి దీక్షా ప్రతిష్ఠా కార్యక్రమాలు ఆలయ నిర్మాణ ప్రతిష్ఠ కమిటీ పర్యవేక్షణలో, గ్రామ పురోహితులు హరిశ్చంద్ర పాడి (బుజ్జిబాబు) బ్రహ్మత్వంలో, యాగాచార్యులు జోశ్యుల కూర్మనాధ శర్మ ఆధ్వర్యంలో, వారి కుమారులు వేంకటదుర్గ రంగ ఆంజనేయ శర్మ (అంజిబాబు) ఆచర్యత్వంలో నిష్ణాతులైన ఋత్విక మండలిచే శాస్త్రోక్తంగా జరగనున్నాయి. జూన్ 22 సోమవారం ఉదయం అంపిలి గ్రామంలో విగ్రహములు, శిఖరములు, యంత్రములు, శిలా మరియు పంచలోహ విగ్రహములతో మంగళ వాయిద్యాలు, భజనలు, సువాసనీలతో శోభాయాత్ర, చింతాడ రామసాయి బృందం వారిచే కోలాటం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం గోధూళి లగ్నపుష్కరమందున విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచన, దీక్షా కంకణ ధారణ, దీక్షా సంకల్పం, అఖండ దీపారాధన, పతాకావిష్కరణ, యాగశాల ప్రవేశం, మండల మంటపారాధనలు, అగ్నిప్రతిష్ఠలు, హవనములు, జలాధివాసం, వేదస్వస్తి మరియు మహా మంగళహారతి జరుగుతాయి. రాత్రి వినోద కార్యక్రమాలలో భాగంగా రోణంకి మీనాక్షి గానం, డి. ఈశ్వరరావు వయోలిన్, టి. నాగేశ్వరరావు మృదంగ సహకారంతో శివలీలలు అను హరికధ ప్రదర్శించబడుతుంది.
జూన్ 23 మంగళవారం ఉదయం నిత్యార్చనలు, వేదపారాయణ, శివ, గౌరి, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, నవగ్రహ, నక్షత్ర, దిక్పాలక పంచపాలక జపములు, హోమములు, చండీయాగం నిర్వహిస్తారు. సాయంత్రం లింగార్చనలు, మహారుద్ర అభిషేకములు, బిల్వార్చనలు, రుద్రహోమము, గౌరీహవనము జరగనున్నాయి. రాత్రి పొందూరు గౌరి బృందంచే శివభాగవతం ప్రదర్శించబడుతుంది. జూన్ 24 బుధవారం ఉదయం దేవి, దేవతల మూల మంత్ర జపములు, త్రిచ, అరుణ, సౌర పూర్వక సూర్యనమస్కారములు జరుగుతాయి. సాయంత్రం క్షీరాధివాసం, మహిళలచే కుంకుమార్చన, పుష్పార్చనలు, ధాన్యాధివాసం, పంచశయ్యాది వాసం, అధివాసాంగ హోమములు నిర్వహిస్తారు. మధ్యాహ్నం కంచుమోజు రామ్మోహనరావు ఆధ్వర్యంలో, జడ్డు జగ్గారావు పర్యవేక్షణలో, ఎన్.వి. రమణ అధ్యక్షతన ఆధ్యాత్మిక సత్సంగ సమావేశం ఉంటుంది. రాత్రి పాలవలస అప్పలనాయుడు (శిర్లాం అప్పలనాయుడు) కృష్ణుడుగా, గేదెల అప్పలనాయుడు కర్ణుడుగా, మజ్జి క్రిష్ణ దుర్యోధనుడుగా, పైల ఆక్కరినాయుడు దృతరాష్ట్రుడుగా శ్రీకృష్ణ రాయబారం ఘట్టం ప్రదర్శించబడుతుంది.
మహోత్సవాలలో ప్రధాన ఘట్టమైన జూన్ 25 గురువారం నిజ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ఉదయం 7 గంటల 34 నిమిషాలకు స్వాతీ నక్షత్రయుత కర్కాటక లగ్న పుష్కరమందున యంత్ర, విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ, తులసీవన ప్రతిష్ఠలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం కళాకుంభావాహన, బలికుంభ దీప దర్శనం, దృష్టిధేను దర్శనం, దర్పణ దర్శనం జరిగి, ఉదయం 10 గంటల నుండి స్వామి వారి సర్వ దర్శనములు, తీర్ధప్రసాద వితరణ ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి ఆలయ ప్రాంగణమున సామూహిక భోజనములతో మహా నారాయణ సేవ జరుగుతుంది. సాయంత్రం స్వామి వారి తిరువీధి మహోత్సవం, రాత్రి 6 గంటలకు అంబికా అన్నపూర్ణాంబ సమేత శ్రీ అమర నాగలింగేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణోత్సవము అఖండ వైభవోపేతంగా జరగనుంది. చివరి రోజు రాత్రి మినగల్లు సుధాకర్ హరిశ్చంద్రుడిగా, కిల్లారి లక్ష్మి చంద్రమతిగా, సిహెచ్. మోహిని నక్షత్రకగా, శంభాన చిన్నారావు కాలకౌశికుడు/వీరబాహుడుగా, కె. రమ కలహకంటిగా, లోలుగు సీతన్నాయుడు శిష్యుడుగా, కె. చంటిబాబు, బి. శ్యామలరావు, జి. సూరిబాబు హార్మోనియం, ఎస్. వెంకటరమణ క్లారినేట్, తండేవలస మాధవ్ డోలక్ సహకారంతో శ్రీ సత్యహరిశ్చంద్ర వారణాశి కాటిఘట్టం అను నాటకం ప్రదర్శించబడుతుంది. భక్తులందరూ ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అంపిలి గ్రామ పురజనులు, పెద్దలు, ఆలయ నిర్మాణ ప్రతిష్ఠ నిర్వహణ కమిటి సభ్యులు కోరుతున్నారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments