ఉషారాణి హత్య కేసు నిందితులకు లాయర్లు ఎవరు వకల్తా పుచ్చుకోవద్దు: ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ విజ్ఞప్తి

పాలకొండ వెబ్ న్యూస్, తేదీ: 16.06.2026: 
​పాలకొండ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకున్న గిరిజన యువతి కుమారి బిడ్డిక ఉషారాణి దారుణ హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ అమానుష ఘటనపై పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ  స్పందించారు. ఈ మేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ మరియు బార్ కౌన్సిల్ కమిటీ అధ్యక్షులు కూన రాజారావు, పాలకొండ బార్ అసోసియేషన్ మరియు బార్ కౌన్సిల్ కమిటీ అధ్యక్షులు పల్లా మునిస్వామిలకు ఒక లేఖ ద్వారా ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఇటువంటి క్రూరమైన చర్యలకు పాల్పడిన నిందితులకు ఏ న్యాయవాది కూడా వకాలత్ తీసుకోరాదని, కోర్టులో వారి తరఫున వాదించరాదని బార్ అసోసియేషన్లు తీర్మానం చేయాలని కోరారు. బాధిత గిరిజన కుటుంబం అత్యంత పేదరికంలో ఉన్నందున, వారికి న్యాయస్థానంలో ఉచిత న్యాయసహాయం అందించడానికి బార్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాదుల బృందాన్ని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసును తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి, ఆరు నెలల లోపు విచారణ పూర్తిగా ముగిసేలా చూడాలని, నిందితులకు గరిష్టంగా ఉరిశిక్ష పడేలా ప్రాసిక్యూషన్‌కు సహకరించాలని కోరారు.
​ఈ నేపథ్యంలో పాలకొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి న్యాయస్థానం ఆవరణ ముందు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అడ్వకేట్ పల్లా మునిస్వామి మరియు లాయర్ల అందరి సమక్షంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో వారి లేఖతో కూటమి నాయకులు కర్నెన అప్పలనాయుడు, జాడ శ్రీధర్, పాలకొండ ఎంపీపీ ప్రతినిధి బొమ్మాలి సుధాకర్, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి నవీన్, గొర్లె రాంబాబు, జామి అనిల్, మిగతాన హరి, శాసపు గోవింద్ తదితరులు కలిసి న్యాయవాదులను అభ్యర్థించారు. బిడ్డిక ఉషారాణి కేసు విషయంలో మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి నైతిక బలం చేకూర్చే విధంగా, నిందితులకు కఠిన శిక్షలు పడేందుకు పాలకొండలో గాని శ్రీకాకుళంలో గాని ఇతర ప్రాంతాల్లో న్యాయవాదులు ఎవరూ నిందితుల తరఫున కేసు వకల్తా పుచ్చుకోకుండా, వాదించకుండా సహకరించాలని ఎమ్మెల్యే తరపున కూటమి పార్టీల ముఖ్య నాయకులు కలిసి కోరడం జరిగింది.
News by: BSS Prasad & T. Simhachalam Legal correspondent

Post a Comment

0 Comments