తోటపల్లి పాత రెగ్యులేటర్ ఆధునికీకరణ పనులు వెంటనే చేపట్టాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి విక్రాంత్ వినతి

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 16, 2026: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఇంచార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ కలిసి తోటపల్లి పాత రెగ్యులేటర్ కాలువ వ్యవస్థ ఆధునికీకరణపై వినతిపత్రం అందజేశారు. పనులు నిలిచిపోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను, రెగ్యులేటర్ దుస్థితిని ఈ సందర్భంగా వివరించారు. 1908లో నాగావళి నదిపై నిర్మించిన ఈ రెగ్యులేటర్ కింద మూడు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు సాగవుతోందని తెలిపారు. ఆధునికీకరణ  పనులు నిలిచిపోయాయని, హెడ్ స్లూయిస్ షట్టర్లు పని చేయకపోవడం వల్ల సాగునీటి నియంత్రణ లోపించి పంటలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. రక్షణ గోడలు శిథిలావస్థకు చేరడంతో రిజర్వాయర్ గట్టుకు ప్రమాదం పొంచి ఉందని, కాలువల వద్ద షట్టర్లు లేక రైతుల మధ్య వివాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ సమస్యలను పరిష్కరించి, చిన్న, సన్నకారు రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని విక్రాంత్ కోరారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments