రెల్లి వీధిలో తీవ్ర నీటి ఎద్దడి: కమిషనర్‌కు వినతిపత్రం అందజేత

పాలకొండ వెబ్ న్యూస్, 10 జూన్, 2026:

​పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని రెల్లి వీధి ప్రజలు దశాబ్దాలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్క వీధుల్లో నీటి సరఫరా సజావుగానే ఉన్నప్పటికీ, తమ వీధికి వచ్చేసరికి రెండు బిందెలకు మించి నీరు రావడం లేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఇరవై ఏళ్లుగా ఈ సమస్యను అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదు. దీనివల్ల నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి తోడు డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మురుగునీరు నిలిచిపోయి వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అలాగే వీధి వెనుక భాగంలో దట్టంగా పెరిగిన ముళ్ళపొదల వల్ల విషసర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయని, తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగర పంచాయతీ కమిషనర్ పి. వి. నూకరాజుకు స్థానికులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జైభీమ్ రెల్లి కుల అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు మజ్జి బాబ్జీ, లోకొండ మహేష్, పాలకొండ దుర్గారావు, అల్లాడ ఫకీరు తదితరులు పాల్గొన్నారు.

​ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments