ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావంతో పాలకొండ ప్రాంత రైతుల్లో ఆందోళన

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 30, 2026: ​ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన ఎండలు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పాలకొండ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ నెలలో వర్షాలు కురుస్తాయని, జూలైలో వర్షాభావం ఉంటుందని ఎల్‌నినో ప్రభావంపై శాస్త్రవేత్తలు తెలిపినట్లు అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు పేర్కొన్నారు. జూన్ 21 తరువాత వర్షం పడడంతో పాలకొండ ప్రాంత రైతులు నారు మడులు, ఎదపోలాలు సిద్ధం చేసుకున్నారు. ఆరుద్ర కార్తె ప్రవేశించి ఐదు రోజులు దాటుతున్నా కొద్దిపాటి వర్షంలోనే విత్తనాలు పోశారు. కొత్తూరు, సీతంపేటలలో భారీ వర్షం పడి నారుమడులకు పదును ఇవ్వకపోవడంతో కొందరు నేటికీ విత్తనాలు వేయలేదు. పాలకొండ ప్రాంతంలో విత్తనాలు వేసి వారం రోజులైనా నారు మొలకెత్తకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు. ఎనిమిది, పది కిలోమీటర్ల పరిధిలోనే వర్షం దోబూచులాడుతోంది. నారు మడులలోని ధాన్యాన్ని చీమలు పోగు చేయడం, పక్షులు వరి గింజలను తినేయడంతో రైతులకు అదనపు విత్తన భారం పెరిగింది. ప్రైవేటు దుకాణాల్లో 20 కిలోల విత్తన బస్తాను 1600 రూపాయలకు కొనుగోలు చేశారు. తోటపల్లి ఎడమ కాలువ ద్వారా సింగుపురం, భాసూరు గ్రామాలకు పారే నీటిని పాలకొండ ప్రాంతానికి అందిస్తే నారు మడులు తడుపుకుంటారు, లేదంటే బిందెలు, ట్రాక్టర్లలో డ్రమ్ములతో తడపడానికి రైతులు సిద్ధమవుతున్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ web news వార్తల కోసం:

Post a Comment

0 Comments