తెలుగు, ఒరియా ఆదికావ్యాలు అనువాదాలే: కవి నల్లి ధర్మారావు

పాలకొండ వెబ్ న్యూస్, 08-06-2026:

​ఒరియా, తెలుగు వారి ఆదికావ్యాలు అనువాదాలేనని ప్రముఖ కవి, రచయిత నల్లి ధర్మారావు గుర్తు చేశారు. బరంపురంలోని రోటరీ క్లబ్ హాల్ లో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో గౌరవ అతిథిగా ఆయన మాట్లాడారు. వ్యాస మహాభారతాన్ని నన్నయాది కవిత్రయం తెలుగులోకి అనువదించగా, అదే తెలుగు వారికి ఆదికావ్యమైందని చెప్పారు. ఒరియా వారికి సారళాదాస్ రచించిన విచిత్ర రామాయణం ఆది కావ్యమని ఉదహరించారు.

​         ఆంధ్ర విజ్ఞాన మిత్రమండలి గౌరవ సలహాదారు పూడిపెద్ది సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మారావు మాట్లాడుతూ, శారళాదాసు రచించిన విచిత్ర రామాయణం ప్రతి ఎన్నో శతాబ్దాలు పరిశోధకులకు లభించలేదని తెలిపారు. జయపురం సంస్థానంలో దివాన్ గా పనిచేస్తున్న డొంకాడ గోపీనాథ కవి విచిత్ర రామాయణానికి తెలుగులో అనువాదం చేశారని, దాని ఆధారంగా శ్రీకాకుళంలో శిష్టకరణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వేరువేరుగా రచించారని చెప్పారు. బహుభాషా పండితులు పురిపండా అప్పలస్వామి వీటిని సేకరించి, 1975లో ఆనాటి ముఖ్యమంత్రి, చరిత్ర పరిశోధకులు డాక్టర్ హరే కృష్ణ మొహతాబ్ కు ఈ సమాచారం అందించారని చెప్పారు. అంతటితో పురిపండా ఆగిపోకుండా, విభిన్న సంస్థానాల్లో  తాళపత్ర గ్రంథాలను అన్వేషించారని, చికిటి సంస్థానంలో ఒక ప్రతి దొరికిందని వివరించారు. దాన్ని మొహతాబ్ కు అందించగా, ఒరియా పరిశోధకులు, పండితులు అధ్యయనం చేసి ఇది సారళదాస్ రచించినదేనని, ఇదే ఒరియా వారి ఆదికావ్యమని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ధర్మారావు చెప్పారు.

​ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి, అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి రచించిన, 'రేబతి' అనే తెలుగు అనువాద కథ సంకలనాన్ని ఒరిస్సా మాజీ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర పండా ఆవిష్కరించారు. ఆమె రచించిన 'సహృదయ వ్యాసావళి' ని ధర్మారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కొంచాడ శివప్రసాద్ సుబుద్ధి, టి వెంకటరావు, విజ్ఞాన మిత్ర మండలి అధ్యక్షులు ఎన్. ఎస్. మూర్తి, ప్రముఖ కవి, రచయిత ఎమ్మెస్వీ గంగరాజు, దూసి పద్మజ, మోనంగి కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్,

 పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments