పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 20-07-2026: పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో దళితులు, ఇతర సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు నాయకులు సోమవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ, కుల వివక్షను రూపుమాపాలని, జీవో 1235తో పాటు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెలగవాడ దళితులకు స్మశాన స్థలం ఉన్నప్పటికీ సరైన రహదారి సౌకర్యం లేదని, అలాగే నివాస స్థలాల కొరత వల్ల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామంలోని కుమ్మరి, విశ్వబ్రాహ్మణ, నాయిబ్రాహ్మణ, రజక, పట్టుశాలి తదితర సామాజిక వర్గాలకు చెందిన సుమారు 70 సెంట్ల స్మశాన వాటిక స్థలంలో ప్రస్తుతం 4 సెంట్లు మాత్రమే మిగిలి, మిగిలినదంతా ఆక్రమణకు గురైందని నాయకులు పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దూసి దుర్గారావు, సీఐటీయూ మండల కార్యదర్శి కాద రాము, స్థానిక నాయకులు M. నవీన్ తదితరుల నేతృత్వంలో ఈ పర్యటన జరిగింది.
0 Comments