తోటపల్లి ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీరు అందించాలి

​పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 20-07-2026..​తోటపల్లి ప్రాజెక్టులో కావలసినంత నీరు ఉన్నప్పటికీ జలవనరుల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పాలకొండ చివరి ఆయకట్టు రైతులకు సకాలంలో సాగునీరు అందడం లేదని తోటపల్లి కాలవల ఆధునీకరణ పనుల సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు విమర్శించారు. నీరు లేక వరి ఆకుమళ్లు ఎండుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రాజెక్ట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నీటిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎం.సింగపురం, బాసురు, ఎల్ ఎల్ పురం, కోటిపల్లి, గుడివాడ, లుంబురు, ఓని, పాలకొండ, కొండాపురం గ్రామాలకు చెందిన నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు హుస్సేన్ పురం ఏడో బ్రాంచ్ కాలువ వద్దకు చేరుకోగా, అధికారులు నీటిని విడుదల చేశారు. అయితే హుస్సేన్ పురం వద్ద కనీసం నాలుగు అడుగుల నీరు వస్తేనే మెయిన్ కాలువతో పాటు 7, 8 బ్రాంచ్ కాలువలకు సాగునీరు అందుతుందని రైతులు జలవనరుల శాఖ డిఈఈ గని రాజు, ఏఈఈ రమణలకు స్పష్టం చేశారు. ఏడో, ఎనిమిదో బ్రాంచ్ కాలువల నీటి పంపిణీ విషయంలో రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని, ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు, ప్రాజెక్ట్ కమిటీ సమావేశమై సక్రమ పంపిణీ ప్రణాళిక రూపొందించాలని కోరారు. ఈ పరిశీలనలో సాగునీటి సంఘం అధ్యక్షులు చేబోదల లక్ష్మీనారాయణ, త్రినాధరావు, గురుబిల్లి అప్పలనాయుడు, పామోటు వైకుంఠరావు, గురువు నాయుడు, లోలుగు సంఘం నాయుడు, పిట్ట రమణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments