పాలకొండ వెబ్ న్యూస్, 08 జూలై 2026:తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ ద్వారా 54 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినప్పటికీ, రెండేళ్లుగా ఆ పనులు ముందుకు సాగడం లేదని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. మదుము తలుపుల మరమ్మతులు, కాలువల వద్ద లస్కర్ల నియామకంపై ఎమ్మెల్యే, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా నిధులు లేవని తెలిపారన్నారు. నరసింహ చెరువు పూడికతో, పద్మనాభ చెరువు మదుములు శిథిలావస్థలో ఉన్నాయని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పది సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కలెక్టరేట్ వేదికగా మంత్రి సంధ్యారాని స్పందించి జలవనరుల శాఖ అధికారులతో రైతులకు సమావేశం ఏర్పాటు చేయాలని సూచించినా 20 రోజులైనా జరగలేదన్నారు.
ఎట్టకేలకు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ స్పందించి ప్రధాన కాలువ పూడికతీత పనులకు రూ.10 లక్షలు కేటాయించడంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఐదు రోజుల క్రితం ప్రారంభమైన ఈ పనులను వర్షాకాలంలో కాకుండా నెల రోజుల ముందే చేపట్టి ఉంటే జూలై 15 కల్లా సాగునీరు విడుదలయ్యేదని ప్రసాదరావు పేర్కొన్నారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, లస్కర్లను నియమించి సాగునీటిని క్రమబద్ధీకరించాలని కోరుతూ, రైతులపై ప్రత్యేక శ్రద్ధ వహించిన ఎమ్మెల్యే జయకృష్ణకు ఖండాపు ప్రసాదరావు ధన్యవాదాలు తెలిపారు.
news by: BSS Prasad
0 Comments