ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం: పంచాయతన స్వరూపిణి శ్రీ శ్రీ కోట దుర్గమ్మ!

ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక భూమిలో ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాచీనమైనది, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి గాంచిన క్షేత్రం.. పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండల కేంద్రంలో వెలసిన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి ఆలయం. రెండు చెరువుల మధ్య ప్రకృతి రమణీయతతో, చారిత్రక నేపథ్యంతో అలరారుతున్న ఈ క్షేత్రం కొన్ని వందల సంవత్సరాల భక్తి సంప్రదాయానికి ప్రతీక.

చారిత్రక నేపథ్యం – చెట్టు కింద వెలసిన జగన్మాత

ఒకప్పుడు పాలకొండను పరిపాలించిన రాజుల కాలంలో ఈ ప్రాంతంలో ఒక వైభవోపేతమైన కోట ఉండేది. కాలక్రమేణా రాజుల పాలన అంతరించి, కోట శిథిలమైపోయింది. కానీ, ఆ కోటను కాపాడిన ఆ తల్లి మహిమ మాత్రం అలాగే నిలిచిపోయింది. కోట శిథిలమైన తర్వాత అమ్మవారు ఒక మహావృక్షం నీడన శిలామూర్తుల రూపంలో దర్శనమిచ్చారు. ఆనాటి రాజులు ఈ మూర్తులను భక్తిశ్రద్ధలతో పూజించి, అర్చనలు జరిపేవారని, రాజుల కాలం నుండి నేటి వరకు అమ్మవారిపై భక్తులకు ఉన్న నమ్మకం నానాటికీ పెరుగుతూనే ఉంది.

అరుదైన వైభవం: పాదాల చెంత ‘పంచాయతన ఆరాధన’

ఈ ఆలయానికి ఉన్న అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక కోణం ఏమిటంటే.. ఇక్కడ అమ్మవారు పంచాయతన స్వరూపం లో కొలువై ఉండటం. శాస్త్రోక్తంగా ఐదుగురు ముఖ్య దేవతలను కలిపి పూజించడాన్ని పంచాయతన పూజ అంటారు.

ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం

సూర్యుడు (ఆదిత్యుడు), అంబిక (దుర్గమ్మ), విష్ణుమూర్తి, గణపతి, మహేశ్వరుడు (శివుడు).. ఈ ఐదు దైవ శక్తులు స్వయంభువుగా ఐదు శిలల రూపంలో అమ్మవారి పాదాల చెంత వెలిశాయి. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఐదు పవిత్ర శిలలకు ఇక్కడ నిరంతర ఆరాధన జరుగుతోంది. ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ దార్లపూడి లక్ష్మీ ప్రసాద శర్మ గారు అర్చక సిబ్బంది ప్రతిరోజూ ఈ పంచాయతన శిలామూర్తులకు శాస్త్రోక్తంగా ధూపదీప నైవేద్యాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

దర్శిస్తే చాలు.. దాటేస్తారు కష్టాలు!

కోట దుర్గమ్మ అమ్మవారి పాదాల చెంత వెలసిన ఈ స్వయంభూ పంచాయతన శిలామూర్తులను దర్శించుకుంటే భక్తుల సకల పాపాలు తొలగిపోతాయని, అనుకున్న పనులు నెరవేరుతాయని భక్తుల గాఢ విశ్వాసం. సంసార సాగరంలో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న వారు, మానసిక ప్రశాంతత లేని వారు అమ్మవారి శరణు వేడితే చాలు.. ఆ తల్లి అభయహస్తం అందించి కాపాడుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. అమ్మవారిని దర్శించుకుని పొందే పూజాఫలం జన్మజన్మల పుణ్యఫలమని భక్తుల నమ్మకం.

అమ్మవారి దివ్య శ్లోకం

దుర్గమ్మ తల్లిని స్మరిస్తూ భక్తులు నిత్యం పఠించే ఈ కింది శ్లోకం అమ్మవారి కరుణాకటాక్షాలను అందిస్తుంది:

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే । శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే ॥

రాజకోటలు అంతరించినా, కాలాలు మారినా.. తనను నమ్మిన భక్తులను రక్షించే కోట దుర్గమ్మ తల్లి మహిమ మాత్రం శాశ్వతంగా వెలుగుతోంది. పాలకొండ పట్టణంలో రెండు చెరువుల మధ్య కొలువై, పంచాయతన శక్తులతో భక్తులను అనుగ్రహిస్తున్న ఆ జగన్మాతను దర్శించి, తరిద్దాం!

॥ శ్రీ కోట దుర్గమ్మ శరణం భవతు ॥

... సంకలనం.. భాసూరు శివ శంకర ప్రసాద్

Post a Comment

0 Comments