పాలకొండ వెబ్ న్యూస్ : పాలకొండ మెయిన్ రోడ్డు నాగవంశం వీధి జంక్షన్లో వేంచేసి ఉన్న శ్రీ పురటాల పోలమాంబ అమ్మవారు ఈరోజు భక్తులకు శాకంబరీ దేవి అవతారంలో నయనమనోహరంగా దర్శనమిచ్చారు. ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా సొరకాయలు, వంకాయలు, క్యారెట్లు, కీరా, మిరపకాయలు, మొక్కజొన్నలతో పాటు వివిధ రకాల ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని అత్యంత శోభాయమానంగా అలంకరించారు. దేవీ భాగవతం ప్రకారం లోకంలో కరువు కాటకాలు ఏర్పడి జీవకోటి అలమటించేటప్పుడు, జగన్మాత తన దేహం నుండి రకరకాల ధాన్యాలు, పండ్లు, కూరగాయలను ఉద్భవింపజేసి సమస్త ప్రాణికోటి ఆకలిని తీర్చిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ శాకంబరీ అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రూపంలో అమ్మవారిని పూజించడం వల్ల పంటలు బాగా పండి, కరువు కాటకాలు నశించి, ప్రజలందరూ ఆయురారోగ్య సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల నమ్మకం.
ఈ శుభ సందర్భంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పట్టువస్త్రాలు, సారెను సమర్పించారు. ఈ విశేష కార్యక్రమం ఆలయ అర్చకులు వేమకోటి రవిబాబు నేతృత్వంలో మరియు శ్రీ పురటాల పోలమాంబ ఆలయ కమిటీ, పాలకొండ నాగవంశం వీధికి చెందిన బాలగణపతి భజన భక్త బృందం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ దివ్య రూపాన్ని తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో పాలకొండ మెయిన్ రోడ్డు ప్రాంతమంతా భక్తుల నామస్మరణలతో మారుమోగింది
0 Comments