శ్రీ జగన్నాథుని లీలలు: దివ్యప్రేమకు ప్రతీకగా నిలిచిన లక్ష్మీ-నారాయణ సంవాదం!

పాలకొండ వెబ్ న్యూస్ : పాలకొండ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి రథోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ అత్యంత అట్టహాసంగా సాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులకు ప్రత్యక్ష దర్శనమిచ్చిన స్వామివారు, బహుడా యాత్ర ద్వారా శ్రీమందిరానికి చేరుకునే ఆధ్యాత్మిక ఘట్టం విశేషంగా నిలుస్తోంది. రథయాత్ర మొదటి రోజు తొలి దశమి నాడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర సమేతంగా గుండీచ మందిరానికి వేంచేస్తారు. ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచ మహారాణి ఇల్లుగా భావించే ఈ ఆలయంలో స్వామివారు కొద్దిరోజులు అతిథిగా పూజలందుకుంటారు. అనంతరం తొలి ఏకాదశి నాడు జరిగే తిరుగు ప్రయాణంలో స్వామివారి రథం పిన్ని అయిన దేవకీదేవి ఆలయం వద్దకు చేరుకుంటుంది. ఈ సమయంలో స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన తవుడు రొట్టెను నైవేద్యంగా సమర్పిస్తారు. బయటి పొర నల్లగా గట్టిగా ఉన్నప్పటికీ, లోపల ఎంతో మెత్తగా తీపిగా ఉండే ఈ ప్రసాదాన్ని పిన్నమ్మ అమితమైన వాత్సల్యంతో స్వామికి నివేదిస్తుంది.
రథయాత్ర ముగించుకుని స్వామివారు తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకునే 'నీలాద్రి విజె' ఘట్టంలో ఒక అరుదైన సన్నివేశం చోటుచేసుకుంటుంది. తమను వెంటబెట్టుకుని వెళ్లకుండా ఒంటరిగా వెళ్లిపోయారని ఆగ్రహించిన శ్రీమహాలక్ష్మీ దేవి, స్వామివారిని సింహద్వారం వద్దే అడ్డుకుని ఆలయ తలుపులు మూసివేస్తుంది. ఈ సందర్భంగా దంపతుల మధ్య జరిగే సరదా వాదన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మహాలక్ష్మీ దేవి తన ఒంటరితనాన్ని, బాధను వ్యక్తం చేయగా, జగన్నాథుడు మధురమైన మాటలతో ఆమెను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తారు. అమ్మవారి అలక తీర్చడానికి స్వామివారు నోరూరించే రసగుల్లా ప్రసాదాన్ని, సుందరమైన పట్టు చీరను కానుకగా సమర్పిస్తూ, భక్తుల పట్ల తన బాధ్యతను, పిన్నమ్మల దర్శన విశేషాలను ప్రేమతో వివరిస్తారు.

     ఈ దివ్య దంపతుల సంవాదం మానవీయ భావోద్వేగాలకు అద్దం పడుతుందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మఠం విశ్వనాధ దాసు తెలిపారు. దాంపత్య జీవితంలో కలిగే చిన్నచిన్న విభేదాలను కోపంతో కాకుండా ప్రేమ, సహనం, క్షమాగుణంతో పరిష్కరించుకోవాలనే గొప్ప సందేశం ఈ లీల వెనుక ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, శ్రీ జగన్నాథ స్వామివారి రథోత్సవ సందర్భంగా లక్ష్మీదేవి - శ్రీ స్వామివారి వాదన ఘట్టం ఈ నెల 26వ తేదీ ఆదివారం అత్యంత వైభవంగా జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి కే. పరమేశ్వరి తెలిపారు. భక్తజనులందరూ ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు.

Post a Comment

0 Comments