పాలకొండ వెబ్ న్యూస్. (పార్వతీపురం మన్యం జిల్లా): పాలకొండ మండలంలోని కొండాపురం గ్రామంలో 1974లో నిర్మించబడి, 52 ఏళ్ల సుదీర్ఘ ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ప్రాచీన శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ వారాహి గుప్త నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక నిష్ఠతో నిర్వహించబడ్డాయి. జూలై 15 గురువారంతో ప్రారంభమైన ఈ పవిత్ర గుప్త నవరాత్రులు నేడు జూలై 23 గురువారం వరకు తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగి, పవిత్ర తొలి ఏకాదశి పర్వదినాన ఘనంగా ముగిసాయి. ఈ ఉత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు ఆలయ అర్చకులు వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ విశేష జపాలు, నిత్యాభిషేకాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా స్థానిక మహిళలతో పాటు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, దీపారాధనలు నిర్వహించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు.
సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం లలితా దేవి సైన్యాధ్యక్షురాలైన శ్రీ వారాహి అమ్మవారిని గుప్త నవరాత్రులలో ఆరాధించడం వల్ల అత్యంత శుభఫలితాలు ప్రాప్తిస్తాయని పండితులు వెల్లడించారు. ఈ పవిత్ర దినాలలో వారాహి దేవిని పూజించడం వల్ల నరదృష్టి, గ్రహదోషాలు, శత్రు భయాలు తొలగిపోయి సర్వత్రా విజయాలు లభిస్తాయని, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించి ఆయురారోగ్యాలు సిద్ధఇస్తాయని పేర్కొన్నారు. అలాగే కుటుంబంలో లక్ష్మీదేవి తాండవించి సకల ఐశ్వర్యాలు లభించడమే కాకుండా తలపెట్టిన ప్రతి కార్యం విఘ్నాలు లేకుండా పూర్తవుతుందని, అమ్మవారికి కుంకుమార్చన జరిపించిన మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి లభిస్తుందని వివరించారు. తొలి ఏకాదశి వేళ ముగిసిన ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ అర్చకులు, నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉమా నీలకంఠేశ్వర స్వామి సమేత వారాహి అమ్మవారి నామస్మరణతో కొండాపురం గ్రామం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది
0 Comments