గ్లైఫోసేట్ వాడకంతో క్యాన్సర్ ముప్పు: అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు హెచ్చరిక

పాలకొండ వెబ్ న్యూస్ : వరి సాగులో యూరియా వినియోగించడం వల్ల క్యాన్సర్ వస్తుందనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని, అయితే కలుపు నివారణకు వాడే 'గ్లైఫోసేట్' రసాయనం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని అభ్యుదయ రైతు, రైతు శాస్త్రవేత్త ఖండాపు ప్రసాదరావు స్పష్టం చేశారు.

యూరియాపై అపోహలు వద్దు..

వరి పంటలో నత్రజని (యూరియా) వినియోగించడం వల్ల చేను ఆకుపచ్చగా మారుతుందని ప్రసాదరావు తెలిపారు. యూరియాను మోతాదుకు మించి ఎక్కువగా వాడితే పచ్చదనం పెరిగి, పంటకు క్రిమి కీటకాలు ఆశించే ప్రమాదం ఉందే తప్ప, దీనివల్ల క్యాన్సర్ వస్తుందనడంలో ఎలాంటి నిజం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియాపై అందిస్తున్న అధిక సబ్సిడీని అరికట్టేందుకు జరుగుతున్న వ్యూహాత్మక ప్రచారంలో భాగమే ఇదన్నారు.

గ్లైఫోసేట్‌తోనే అసలైన ముప్పు!

కలుపు నివారణ కోసం రైతులు విరివిగా వాడుతున్న గ్లైఫోసేట్ రసాయనం భూసారాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జన్యుపరంగా మార్పులు చేసిన పత్తి (BG-III / HT Cotton) పంటలో కలుపును నివారించడానికి ఈ మందును చల్లుతున్నారని వివరించారు. ఈ రసాయనాన్ని చల్లినప్పుడు పత్తి మొక్కలు మినహా మిగిలిన గడ్డి జాతులన్నీ చనిపోతాయని, ఒక పంట కాలంలో రెండు మూడు సార్లు చల్లడం వల్ల కొత్తగా గడ్డి మొలవకుండా రసాయన ప్రభావం భూమిలో ఉండిపోతుందని పేర్కొన్నారు. ఈ తాత్కాలిక లాభం కోసం రైతులు గ్లైఫోసేట్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.

క్యాన్సర్‌కు దారితీస్తున్న రసాయన అవశేషాలు:

అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో గ్లైఫోసేట్ రసాయనాన్ని ఐదేళ్ల క్రితమే పూర్తిగా నిషేధించినప్పటికీ, మన దేశంలో ఇంకా దీనిపై పూర్తిస్థాయి నిషేధం అమలు కాకపోవడం విచారకరమన్నారు. గ్లైఫోసేట్ వాడిన నేలల్లో భూసారం దారుణంగా పడిపోవడమే కాకుండా, ఆ తర్వాత అక్కడ పండించే ఆహార పంటలు, కూరగాయలలో ఈ రసాయన అవశేషాలు చేరిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ఈ కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్లే ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని ఖండాపు ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు.

సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి: తెలంగాణ రాష్ట్రంలో గ్లైఫోసేట్ విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ, కొందరు స్మగ్లర్లు పొరుగు రాష్ట్రాల నుండి దొడ్డిదారిన ఆంధ్రా సరిహద్దుల గుండా వీటిని తెచ్చి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు. ఆంధ్రా డీలర్ల అక్రమ దందాను అరికట్టేందుకు అధికారులు తక్షణమే స్పందించి, సరిహద్దు వంతెనలపై ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కఠిన నిఘా ఉంచాలని పర్యావరణ ప్రేమికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.


Post a Comment

0 Comments