పాలకొండ ఇందిరానగర్ కాలనీలో.. రాజరాజేశ్వరి సమేత పంచముఖేశ్వరస్వామి వారి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం

​పాలకొండ వెబ్ న్యూస్, తే 5-7-2026 ది:పాలకొండ ఏలాం- ఇందిరానగర్ కోలనీలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో చాంద్రమాన పరాభవనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ షష్ఠి సోమవారం తే 6-7-2026 ది నుంచి తే 8-7-2026 ది అష్టమి బుధవారం వరకు రాజరాజేశ్వరి సమేత పంచముఖేశ్వరస్వామి వారి వినాయక, నాగబంద, శిఖర, నందీశ్వర యంత్ర ధ్వజస్తంభ సహిత ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుపబడును. తొలిరోజు ఉదయం ప్రతిష్టాంగ దేవతల తిరువీధి ఊరేగింపుతో కార్యక్రమాలు ప్రారంభమై, మహిళలు కలశములతో నీళ్ళు తీసుకొని దేవాలయం వద్దకు చేరుకుంటారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, వివిధ మండపారాధనలు, అగ్ని ప్రతిష్ఠాపన, జలాధివాసం, సాయంత్రం వేదపారాయణ, మూల మంత్ర హోమం, తీర్ధప్రసాద వితరణ ఉంటాయి. మంగళవారం పునఃపూజలు, రుద్ర హోమం, ధాన్యాదివాసం, సాయంత్రం మహాలింగార్చనా సహిత ఏకదశవార రుద్రాభిషేకం జరుగుతాయి. బుధవారం ఉదయం వేద పారాయణ, ప్రతిష్ఠాంగ హోమాలు, గర్తన్యాసం, రత్నన్యాసం నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు రేవతీ నక్షత్రయుత కర్కాటక లగ్న పుష్కరమున యంత్ర, విగ్రహ, శిఖర ద్వజ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, మహా పూర్ణాహుతి, శాంతి శివపార్వతీ కళ్యాణం, పండిత సత్కారం జరుగుతాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నసమారాధన జరుపబడును. పురజనులు, పెద్దలు, ఆలయ నిర్మాణ ప్రతిష్ఠ నిర్వాహణ కమిటి బృందం సమర్పణలో జరిగే ఈ కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు రామప్రసాదపాడి నేతృత్వంలో మరియు మారుతీ సహిత రాజరాజేశ్వరీ జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మావుడూరి ప్రసాదరావు శాస్త్రి, ఉభయ ఆగమ పండిట్ శతనేక ప్రతిష్టాపకులు వారి కుమారులు మావుడూరి లక్ష్మీనరసింహస్వామి ఆధ్వర్యంలో జరుపబడును.

​news by: BSS ప్రసాద్, పాలకొండ web news వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments