పెట్రోల్ బంక్ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వాలి: సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ

​పాలకొండ వెబ్ న్యూస్, 15-07-2026: పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న పంపు ఆపరేటర్స్, సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 30న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పాలకొండలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, మండల కార్యదర్శి కాద రాము మాట్లాడుతూ, పాలకొండ పట్నంలో ప్రస్తుతం 6 బంకులు ఉన్నాయని తెలిపారు. జీవో ఎంఎస్ నెంబర్ 89 ప్రకారం పంపు అటెండర్లు, హెల్పర్, వాచ్‌మెన్, సెక్యూరిటీ గార్డ్లకు నెలకు ₹13,126, సేల్స్ మెన్, ఫోర్ మెన్ కి ₹13,774, అకౌంటెంట్ కి ₹13,542, క్యాషియర్, కంప్యూటర్ ఆపరేటర్లకి ₹13,334 వేతనాలు ఇవ్వాల్సి ఉండగా, అత్యధిక బంకుల్లో కేవలం 8000 నుండి 10,500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందితో 14 గంటల నుండి 24 గంటలు డ్యూటీ చేయిస్తూ ఓవర్ టైము వేతనం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కనీస వేతనములు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచి జీవోలు సవరించాల్సి ఉన్నా, 12 సంవత్సరాలు అవుతున్నా వేతన సవరణ జరగలేదన్నారు. వేతన సవరణ, అమలు కోసమే జూలై 30న ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments