పాలకొండ వెబ్ న్యూస్, 15-07-2026: వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ జిల్లాలో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటల సాగు ప్రారంభించారని, అయితే ఎరువులు, సాగునీరు సకాలంలో అందకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వీరఘట్టం మండలం చలివేంద్రి గ్రామంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామ రైతు సేవా కేంద్రాలలో తగినంత ఎరువులు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చలివేంద్రి గ్రామంలో 1200 ఎకరాల సాగు భూమికి 2400 బస్తాల యూరియా అవసరం కాగా కేవలం 400 బస్తాలు, 600 బస్తాల డిఏపికి గాను 240 బస్తాలు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. దీనివల్ల ప్రైవేట్ వర్తకులు అధిక ధరలకు ఎరువులను అంటగడుతూ భారం మోపుతున్నారని, వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కౌలు రైతులకు భూమి వివరాలు లేకపోవడంతో ఎరువులు అందడం లేదని, తక్షణమే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తోటపల్లి కుడి, ఎడమ పాత, కొత్త కాలువాలు, రావాడ రిజర్వాయర్, జంఝావతి ప్రాజెక్టు, వెంగళరాయ, పెద్దగడ్డ, సీతానగరం, పెదంకలాం కాలువల పూడికలు, షెటర్స్ సమస్యలను బాగు చేయకపోవడం వల్ల సాగునీరు అందడం లేదని, కలెక్టర్ స్పందించి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి బొత్స గౌర్నాయుడు, గర్భాన తవిటి నాయుడు, సత్తివాడ సంఘం నాయుడు, బొత్స జగ్గు నాయుడు, అలజంగి నాగేశ్వరరావు, కలమట రామకృష్ణ, కందల శ్రీరామ నాయుడు, పోరెడ్డి వెంకటరమణ, కమ్మ వలస లక్ష్మణరావు, రాజాన రాజారావు పాల్గొన్నారు
0 Comments