రాజభాష హిందీ వికాసానికి అండగా నిలవండి: ప్రభుత్వానికి హిందీ మంచ్ వినతి

పాలకొండ వెబ్ న్యూస్, జూలై 19, 2026:

​రాష్ట్రంలో రాజభాష, జాతీయ భాష హిందీ వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతని ఇవ్వాలని వక్తలు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళంలోని 80 ఫీట్ రోడ్డులో గల బికేఎస్ జూనియర్ కళాశాలలో జిల్లా అధ్యక్షులు కనుగుల సత్యం అధ్యక్షతన హిందీ మంచ్ సంస్థ జిల్లా ప్రత్యేక కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథి, హిందీ మంచ్ రాష్ట్ర కమిటీ ముఖ్య సలహాదారు బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అధికార భాష, జాతీయ భాష హిందీని మన రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ హిందీ సలహా మండలి సభ్యులు కోనే శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మూడవ తరగతి నుండి హిందీ బోధనను ప్రవేశపెట్టాలని, రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని ఎల్పీసెట్ హిందీ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు.

​ఈ సందర్భంగా హిందీ సేవా సదన్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న హిందీ టాలెంట్ టెస్ట్ బ్రోచర్, కరపత్రాలను సభ్యులు ఆవిష్కరించారు. ఇటీవల హిందీ మంచ్ రాష్ట్ర కమిటీ ముఖ్య సలహాదారుగా ఎన్నికైన విశ్రాంత డీఈవో బలివాడ మల్లేశ్వరరావును, అలాగే హిందీ ప్రచారానికి కృషి చేస్తున్న కనిమెట్ట పద్మావతి, పి.వి. ఎస్. ఎన్. మూర్తి, ఎస్.వి. రమణ మాదిగ, కనుగుల సత్యం, బాడ మంజుల, రొంపివలస రామారావులను సంస్థ తరపున ఘనంగా సత్కరించారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి. జగన్మోహనరావు, టీడీపీ సీనియర్ నాయకులు ఎస్. వి. రమణ మాదిగ భాషాభివృద్ధికి తమ సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో బరాటం లక్ష్మణరావు, పుక్కల్ల లక్ష్మణ్, పూడి జనార్దనరావు, STP శిరీష, అల్లూరి ప్రభావతి, ఈరంకి ఉమారాణి, ఎన్. పద్మనాభరాజు తదితరులు పాల్గొని పలు తీర్మానాలను ఆమోదించారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments