సాగునీటి సమస్యలను పరిష్కరించి రైతన్నలకు బాసటగా నిలవాలి: అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు

మట్టిలో చెమట చిందించి దేశానికి తిండి పెట్టే అన్నదాతల సమస్యలను సకాలంలో గుర్తించి, వారికి అవసరమైన సాగునీరు మరియు వ్యవసాయ సదుపాయాలను త్వరితగతిన అందించాలని సీనియర్ సిటిజన్, అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు అధికారులను కోరారు. పాలకొండ మండలంలోని నరసింహ చెరువు అభివృద్ధి, సాగునీటి సరఫరా మరియు షట్టర్ల మరమ్మతులపై సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

​ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో కాలువ పరిధిలోని శివారు 16 గ్రామాల రైతులకు సాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రసాదరావు పేర్కొన్నారు. రైతులు ఇప్పటికే ఎకరాకు దాదాపు 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాలు నాటుకున్నారని, వారికి జలవనరుల శాఖ మరియు జిల్లా యంత్రాంగం నుండి పూర్తి స్థాయిలో సహకారం అందించి ఆదుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులతో పాటు చెరువును మరింత సమర్థవంతంగా వినియోగంలోకి తెచ్చేలా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతం చేయాలని ఆకాంక్షించారు.

​తోటపల్లి ఎడమ కాలువ ద్వారా శివారు ప్రాంతమైన పాలకొండకు సాగునీరు సజావుగా అందేలా మూడు శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని విన్నవించారు. అలాగే, పంటల బీమా పథకంపై గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, దరఖాస్తు ప్రక్రియను రైతులకు సులభతరం చేయాలని కోరారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మన్యం జిల్లాలో ఎకరాకు నిర్ణయించిన బీమా ప్రీమియం రూ. 820 భారాన్ని పరిశీలించి, రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు, ప్రభుత్వానికి అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments