పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని గారమ్మ కాలనీలో రహదారులు లేకపోవడంతో కొన్ని వీధుల ప్రజలు నడుములోతు వర్షపు నీటిలోనే ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది. చిన్న కాపు వీధి నుంచి కాలనీకి వెళ్లే దారిలోని ఎంట్రెన్స్ బ్రిడ్జి వద్ద విపరీతంగా చెత్త, గడ్డి, పిడకలు పేరుకుపోవడంతో నీరు ముందుకు సాగక కాలనీలోకి ప్రవేశిస్తోంది. వీధుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ముక్కుపుటాలు అదిరేలా దుర్గంధం వెదజల్లుతోంది. ఎక్కడ చూసినా కొండల్లా పేరుకుపోయిన చెత్త కుప్పలతో పారిశుద్ధ్యం తీవ్రంగా క్షీణించింది. నీటి నిల్వల కారణంగా పిల్లలు పాఠశాలలకు వెళ్లలేక, పెద్దలు పనులకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్థానికులు పడుతున్న కష్టాలపై అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
0 Comments