పాలకొండలో చిన్నారిపై కుక్కల దాడి: చర్యలు తీసుకుంటామన్న కమిషనర్

పాలకొండ వెబ్ న్యూస్ : నగర పంచాయతీ పరిధిలోని నక్కలపేట సాయిదుర్గా నగర్ 7వ లైన్‌లో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో తీవ్ర భయాందోళనకర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక నివాసి ఆవు రాము కుమార్తె తనూషపై ఒకేసారి సుమారు 7,8 వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ​ఈ ఘటనపై  సురవరపు కృష్ణారావు వెంటనే స్పందించి పాలకొండ నగర పంచాయతీ కమిషనర్‌కు సమాచారం అందించారు. కమిషనర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోగా, అప్పటికే గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ​అనంతరం కమిషనర్ ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. పట్టణంలో తీవ్రమవుతున్న వీధి కుక్కల బెడదను అరికట్టాలని, తగిన నివారణ చర్యలు చేపట్టాలని సురవరపు కృష్ణారావు ఈ సందర్భంగా కమిషనర్‌ను కోరారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీధి కుక్కల భయం నుంచి తమకు విముక్తి కలిగించాలని నక్కలపేట సాయిదుర్గా నగర్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Post a Comment

0 Comments