శ్రీకాకుళం, సెప్టెంబర్ 19: తెలుగు భాష, సాహిత్యం, పత్రికా రంగాల్లో ఎనిమిది దశాబ్దాల క్రితమే అభ్యుదయానికి పెద్దపీట వేసిన దార్శనికుడు తాపీ ధర్మారావు అని పలువురు వక్తలు నివాళులు అర్పించారు.శనివారం ఉదయం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఆయన జయంతి కార్యక్రమం జరిగింది.ఇదే హైస్కూల్లో,తాపీ ధర్మారావు 1900 సంవత్సరంలో చదువుకున్నారు.ఆయన గురించి వినడమే తప్ప, ఇక్కడ చదివిన విషయం తమకు తెలియదని అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు భరద్వాజ్ చెప్పారు. అరసం జిల్లా అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు మాట్లాడుతూ, తెలుగు సాహిత్య, పత్రికా రంగాల్లో తాపీ ధర్మారావు కు ఒక ప్రత్యేకత ఉందన్నారు.1887 సెప్టెంబర్ 19న బరంపురంలో జన్మించిన ధర్మారావు, శ్రీకాకుళం, విజయనగరం, పర్లాకిమిడి, మద్రాసులో చదువుకున్నారని, గిడుగు రామమూర్తి పంతుల ప్రభావం అతనిపై ఎక్కువగా ఉందని చెప్పారు. గ్రాంథిక భాషా వాదిగా సాహిత్యం సృష్టిస్తున్న దశలో, గిడుగు ప్రభావంతో వాడుక భాష వాదిగా మారి, గిడుగు, గురజాడ ఉద్యమానికి అండదండలు అందించారని తెలిపారు. భాష, సాహిత్యం, పత్రిక, ఆనాటి రాజకీయాలలో అభ్యుదయ దృక్పథంతో అనేక సంచలనాల సృష్టించారని అన్నారు. ప్రముఖ రచయిత గుడిపాటి చలం తొలిసారిగా ఆయనను,
' తాతాజీ 'అని పిలిచారని, జస్టిస్ పార్టీ రాజకీయాల్లో భాగంగా వెంకటగిరి జమీందారు స్థాపించిన ' ' 'జనవాణి 'పత్రికకు సంపాదకులుగా వ్యవహరించే పాపులర్ జర్నలిజానికి ఆద్యునిగా చరిత్ర సృష్టించారని చెప్పారు. అందువల్ల, ఆయన జయంతిని , తెలుగు మాధ్యమాల దినోత్సవం గా నిర్వహిస్తుంటారని తెలిపారు. ప్రముఖ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు ఆయన శిష్యుడేనని చెప్పారు. సినిమా రంగంలో కూడా ప్రవేశించి, మాలపిల్ల, రైతు బిడ్డ, కీళ్లు గుర్రం వంటి సినిమాలకు సంభాషణలు అందించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాపీ ధర్మారావు విగ్రహాన్ని, శ్రీకాకుళం హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రముఖ విద్యావేత్తలు జరజాపు గణేష్, జామి భీమ శంకరరావు, స్సామ్నా జిల్లా అధ్యక్షులు సున్నపు చిన్నారావు, హైస్కూల్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 Comments